: లోక్ సభ సోమవారానికి వాయిదా!... రాజ్యసభ సమావేశాలపైనా డౌటే!
పార్లమెంటులో నేటి సమావేశాల తీరును పరిశీలిస్తే... ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశాలు క్షణక్షణానికి తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. నేటి ఉదయం సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఆప్ ఎంపీ భగవత్ మాన్ వీడియో కలకలంతో కొద్దిసేపటి క్రితం లోక్ సభతో పాటు రాజ్యసభలో పెను దుమారం రేగింది. ఈ క్రమంలో లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా భగవత్ మాన్ విషయం అటు రాజ్యసభలోనూ హీటెక్కించింది. దీంతో రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదా పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే కేవీపీ బిల్లుపై ఓటింగ్ వచ్చే శుక్రవారానికి వాయిదా పడక తప్పదు. పార్లమెంటులో జరుగుతున్న వరుస పరిణామాలను అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.