: ఫ్రెండులా ఇరవై ఏళ్లు తమతో గడిపిన బాతుకు విగ్రహం కట్టించిన ఇంగ్లాండు ప్రజలు
దేశానికి సేవ చేసిన రాజకీయ నాయకులు, సంఘసంస్కర్తల విగ్రహాలను కట్టించి వారిని ప్రజల మదిలో ఎల్లకాలం గుర్తుండి పోయేలా చేసుకోవడం సంప్రదాయం. అయితే ఒక పక్షి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం కోసం విగ్రహం కడితే..? ఇంగ్లాండ్‌లోని రిటిల్ నగరంలో అదే జరిగింది. గాడ్‌ఫ్రే అనే బాతుకి విగ్రహం నిర్మించి ప్రజలందరూ నివాళులర్పించారు. గాడ్‌ఫ్రే రిటిల్‌లోని ఓ సరస్సులో హాయిగా ఉండేది. అయితే స్థానికులు ఆ సరస్సులో తాము పెంచుకుంటోన్న మరికొన్ని బాతులను వదిలేశారు. కొత్తగా సరస్సులోకి వచ్చిన బాతులు గాడ్‌ఫ్రేని గాయపరిచాయి. దీంతో ఆ బాతు నీరసించి చనిపోయింది. తాము అపురూపంగా చూసుకున్న బాతు గాడ్‌ఫ్రే మృతి చెందడంతో స్థానికులు కలత చెందారు. ఆ బాతుకి గుర్తుగా విరాళాలు వేసుకొని విగ్రహం కట్టించారు. స్థానికులకు గాడ్‌ఫ్రే ఇరవై ఏళ్లుగా ఓ ఫ్రెండులా ఉండేది. ఆ బాతు ఉండే సరస్సు దగ్గరకి ఎవరయినా ఫొటో దిగడానికి వస్తే అది వెంటనే వారి వద్దకు వచ్చి ఫొటోకు ఫోజిచ్చి వారిని ఆకర్షించేది. రాత్రి పూట ఆ సరస్సులో పెట్రోలింగ్ చేస్తున్నట్లు తిరిగేది. కొంతమంది పిల్లలు దానిపై ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇరవై ఏళ్లుగా దాన్ని చూస్తూనే గడిపారు. ఒక్కసారిగా ఆ బాతు మరణించడంతో దాని జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవడం కోసం సరస్సు ఒడ్డునే గాడ్‌ఫ్రేకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.