: అస్సాంలో 239 ఖడ్గ మృగాలను చంపేశారు.. వెల్లడించిన మంత్రి
అస్సాంలో గత పదహారేళ్లలో 239 ఖడ్గ మృగాలను వేటగాళ్లు పొట్టనబెట్టుకున్నారు. 2001 నుంచి ఇప్పటి వరకు వేటగాళ్లు 239 ఖడ్గ మృగాలను చంపేసినట్టు స్వయంగా అటవీశాఖా మంత్రి ప్రమీలా రాణి అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం పేర్కొన్నారు. ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన మంత్రి.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 661 మంది వేటగాళ్లను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. వేటగాళ్ల చేతిలో బలైన ఖడ్గ మృగాల్లో 161 కజిరంగా నేషనల్ పార్క్‌కు సంబంధించినవని మంత్రి తెలిపారు. అలాగే 34 ఒరాంగ్ నేషనల్ పార్క్, పబితోరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చెందిన 15 ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, మనాస్ జాతీయ పార్కుకు చెందిన 9, ఇతర ప్రాంతాలకు చెందిన మరో 20 ఖడ్గమృగాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 15 ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఈ జనవరిలోనే వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు సభకు తెలిపారు. వీటిలో 12 కజిరంగా పార్కుకు చెందినవి కాగా మిగతా మూడు మనాస్, ఒరాంగ్, సోనిత్‌పూర్‌కు చెందినవని మంత్రి వివరించారు.