: ఏపీలో రెండు జిల్లాల కలెక్టర్ల మార్పు అనివార్యం!...కేంద్ర సర్వీసులకు ‘ఐఏఎస్ కపుల్’ యువరాజ్, జానకి!
ఏపీలో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఫలితంగా విశాఖపట్నం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్ల మార్పు అనివార్యంగా మారింది. వివరాల్లోకెళితే... విశాఖ కలెక్టర్ గా ఉన్న యువరాజ్, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న జానకి దంపతులు. తామిద్దరం ఒకే చోట పనిచేసేందుకు అవకాశం కల్పించాలని నిన్న విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును వారు కోరారు. అయితే జిల్లా కలెక్టర్లుగా ఉన్న వీరిద్దరికి ఒకే చోట పోస్టింగ్ వేయడం దాదాపుగా కుదరదు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసులకు వెళ్లే విషయంలోనైనా తమకు అనుమతి ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారట. ఇందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... వారు సెంట్రల్ సర్వీసులకు వెళ్లేందుకు సమ్మతించారు. ఈ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీరికి ఆఫర్ వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు వీరిలో ఒకరు పర్సనల్ సెక్రటరీగా వెళ్లనున్నారు. మరొకరికి ఢిల్లీలోనే ఇతర శాఖల్లో ఏదో ఒక పోస్టు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు వారంలోగా వీరి కేంద్ర సర్వీసుల డిప్యూటేషన్ కు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. వీరు రిలీవ్ కాగానే విశాఖ, నెల్లూరు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించేందుకు ఇప్పటికే ఏపీ సర్కారు కసరత్తు ప్రారంభించింది.