: హైదరాబాద్‌లో అదృశ్యమై ఎదుర్లంకలో ప్రత్యక్షమైన చిన్నారులు.. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు
హైదరాబాద్‌లో అదృశ్యమైన ఇద్దరు బాలికలు తూర్పు గోదావరి జిల్లాలోని ఎదుర్లంక చేరుకున్నారు. ఈ ఉదయం వారు తిరిగి క్షేమంగా హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నారు. హైదర్‌గూడకు చెందిన వైష్ణవి(11), మాధవి(6) బుధవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా అదృశ్యమయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వారు నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ వారు ఓ రైలు ఎక్కినట్టు గమనించిన పోలీసులు ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. తమది ఎదుర్లంక అని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంతో అక్కడి వారి బంధువులకు పోలీసులు సమాచారం అందించి చిన్నారుల గురించి ఆరా తీశారు. బాలికలు ఇద్దరూ గురువారం ఉదయం ఎదుర్లంక చేరుకున్నట్టు వారు చెప్పారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న చిన్నారులు నేరుగా హైదరాబాద్-కాకినాడ రైలు ఎక్కి ఎదుర్లంక చేరుకున్నారు. అనంతరం స్టేషన్ నుంచి వారి మామయ్య ఇంటికి చేరుకున్నారు. వీరిద్దరినీ చూసిన ఆయన షాక్ తిన్నారు. వెంటనే వారిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఈ ఉదయం ఆయన పిల్లలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ‘‘గుమ్మం ముందు నిలబడిన మాధవి, వైష్ణవిలను చూసి షాక్‌కు గురైనట్టు వారి మామయ్య వీరాస్వామి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏం జరిగిందోనని ఆందోళన చెందామని, అందుకే వారిని తీసుకుని బయలుదేరినట్టు వివరించారు.