: కార్ల దొంగతనంలో 'సెంచరీ' కొట్టిన రాబిన్.. సినిమా స్ఫూర్తితో దొంగతనాలు


ఖరీదైన కార్లు దొంగిలించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న ఓ దొంగ ఏకంగా వందకార్లు దొంగిలించి సెంచరీ కొట్టాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఆగ్నేయ ఢిల్లీలో గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్న రాబిన్ ఇంటిపై దాడిచేసిన పోలీసులు అతడి నేర చరిత్ర తెలిసి అవాక్కయ్యారు. ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!' సినిమాను 25 సార్లు చూసిన రాబిన్ దానిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. సినిమాలోని ‘సూపర్ చోర్’ బంటీలా ఉండాలని భావించి కార్ల దొంగతనాలకు తెరతీశాడు. అంతేకాదు బంటీ ఫొటోను తన పర్సులో పెట్టకున్నాడు కూడా. కార్లలో అపార్ట్‌మెంట్లకు వెళ్లే రాబిన్ అక్కడి నుంచి అంతకంటే విలువైన కార్లను దొంగిలించి పరారయ్యేవాడని పోలీసులు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా దొంగతనం వృత్తిలో ఉన్న రాబిన్ ఆ సినిమా చూసిన అనంతరం సినిమా స్టైల్లో కార్లు దొంగిలించేవాడు. రాబిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి బీఎండబ్ల్యూ, టయోటా ఫార్య్చూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నోయిడాలోని సెక్టార్ 17ఏకు ఆడి ఎ-7 కారులో వెళ్లిన రాబిన్ అక్కడి నుంచి అంతకంటే ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో బయటకు వచ్చాడు. ఖరీదైన కాలనీలో నివసించే వారిని లక్ష్యంగా చేసుకునే రాబిన్ వారు మార్నింగ్ వాక్‌కు వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించి కారు తాళాలు తీసుకుంటాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి దర్జాగా కార్లతో పారిపోయేవాడని వివరించారు. దొంగిలించిన కార్లను ఉధంసింగ్ నగర్‌లో ఓ వ్యక్తికి విక్రయించే వాడని పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యాణా, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రాబిన్ కార్ల దొంగతనాలకు పాల్పడినట్టు డీసీపీ పుష్పేంద్ర తెలిపారు.

  • Loading...

More Telugu News