: ఎకరాకు రూ.1.37 లక్షల కౌలు!... గుంటూరు జిల్లాలో రికార్డు ధర పలికిన ఆలయ భూమి!


ఆ భూమిలో వర్షం పడితేనే పంట పండుతుంది. పంట పండితేనే పెట్టిన పెట్టుబడి వస్తుంది. వర్షం కురవకుంటే... పంటా పండదు. పెట్టిన పెట్టుబడిలో సింగిల్ పైసా రాదు. అయినా ఆ భూమికి రికార్డు స్థాయిలో కౌలు రేటు పలికింది. అప్పటిదాకా ఆ భూమిపై కన్నెత్తిచూడని రైతులు నిన్న జరిగిన వేలంలో పోటీ పడి రేటు పెంచేశారు. సింగిల్ ఎకరం కౌలు ధర రూ.1.37 లక్షలు పలికింది. మొత్తం 5.9 ఎకరాల పొలాన్ని ఓ రైతు రూ.8.09 లక్షలిచ్చి కౌలుకు తీసుకున్నాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో చోటుచేసుకుంది. ఇక ఈ రికార్డు ధర పలికిన భూమి సిరులు పండే భూమి ఏమీ కాదు... ఏళ్ల తరబడి బీడుగా ఉన్న గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన భూమి. సదరు దేవస్థానం కౌలు విషయంలో జరిపిన వేలంలో ఈ రేటు పలికింది. విలువ పరంగా కోట్లాది రూపాయలు పలికే ఈ భూమిని కొందరు కబ్జా చేసేశారు. అయితే దీనిని గమనించిన దేవాదాయ శాఖ కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘంగా జరిగిన విచారణలో దేవాదాయ శాఖ వాదనే నెగ్గింది. భూమి ఆలయానికి వచ్చేసింది. అయితే కింది కోర్టు తీర్పుపై భూమిలో జెండా పాతిన వ్యక్తులు పైకోర్టుకెక్కారు. ప్రస్తుతం ఈ వివాదంపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు తీర్పు వెలువడేలోగా ఈ భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లరాదన్న భావనతో భూమి హక్కుదారులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన తమ బంధువు మన్నెం నాగేశ్వరరావును రంగంలోకి దించి లక్షల్లో వేలం పాడించి భూమిని కౌలుకు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News