: జగన్ కు ‘తూర్పు’లో ఝలక్!... నేడు సైకిలెక్కనున్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తూర్పు గోదావరి జిల్లాలో నేడు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. పార్టీ తరఫున తొలి ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న ఆదిరెడ్డి అప్పారావు నేడు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా జరిగిన చర్చల్లో భాగంగా ఆదిరెడ్డి చేరికకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడికి దగ్గరి బంధువైన ఆదిరెడ్డి టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తనను నమ్మి పార్టీలోకి వచ్చిన ఆదిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన జగన్ ఆయనకు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. అయితే గడచిన ఎన్నికల్లో వైసీపీ విపక్ష స్థానానికే పరిమితం కావడం, టీడీపీ అధికారం చేపట్టడంతో పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఇప్పటికే వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గోడ దూకేశారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి కూడా తన సొంత పార్టీ వైపు చూశారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభ్యంతరంతో ఆదిరెడ్డి చేరిక కాస్తంత ఆలస్యమైంది. ఎట్టకేలకు గోరంట్ల కూడా ఆదిరెడ్డి రీఎంట్రీకి సరేననడంతో జగన్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పలేదు. మరికాసేపట్లో రాజమహేంద్రవరం నుంచి 100 బస్సులు, 150 కార్లలో భారీ అనుచరగణంతో విజయవాడకు బయలుదేరనున్న ఆదిరెడ్డి... చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోనున్నారు.