: రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ నేడే!... తెలుగు ప్రజల దృష్టి అంతా పార్లమెంటుపైనే!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుపై నేడు రాజ్యసభలో ఓటింగ్ జరగనుంది. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న పార్టీగా ఏపీలో తాను కోల్పోయిన ప్రాభవాన్ని ఈ బిల్లుకు ఆమోదంతో రాబట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఇప్పటికే ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీతో పాటు అన్ని పార్టీలకు కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. ఈ విషయంలో చాలా పార్టీల నుంచి సానుకూల సమాధానం లభించింది కూడా. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కంటే అధికంగా ప్రయోజనం చేకూరుస్తున్నామన్న బీజేపీ సర్కారు... ఈ బిల్లుపై కాస్తంత గుర్రుగా ఉంది. అసలు సభలో ఆ బిల్లును ఓటింగ్ కు రానివ్వబోమని బీజేపీ ఏపీ శాఖకు చెందిన నేతలు కొందరు ప్రకటించినా... కేంద్ర నాయకత్వం మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. బిల్లుకు మద్దతిస్తే ఎలా ఉంటుంది?... ఇవ్వకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? అన్న కోణాలను ఆ పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ బిల్లు ఓటింగ్ కు వస్తే ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఆ పార్టీ ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజ్యసభ కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

  • Loading...

More Telugu News