: అవును, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాను... అయితే ఏంటి?: ఆప్ ఎంపీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ సెక్యూరిటీ పాయింట్లను చూపుతూ తీసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కలకలం రేగుతోంది. ఆప్ ఎంపీ ఇది స్టింగ్ ఆపరేషన్ అని చెబుతున్నప్పటికీ, పార్లమెంటుపై గతంలో జరిగిన ఉగ్రదాడి అనుభవాల నేపథ్యంలో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను ఆప్ ఎంపీ ఎవరి కోసం చిత్రీకరించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భగవంత్ మాన్ మాట్లాడుతూ, పార్లమెంటు ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మాత్రమే ఆ వీడియోలో చెప్పానని అన్నారు. తాను చిత్రీకరించిన వీడియో నిజంగా పార్లమెంటు భద్రతకు విరుద్ధంగా ఉందా? అని అడిగారు. పార్లమెంటు జీరో అవర్ లో భద్రత అంశం ప్రస్తావించాలనే తాను ఆ పని చేశానని చెప్పారు. ఆ సందర్భంగా తనను ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెబుతానని ఆయన చెప్పారు.