: ‘కబాలి’ టికెట్ల కోసం రికమండేషన్ లెటర్లు!


ఉద్యోగం కోసమో, దేవుడి దర్శనం కోసమో రికమండేషన్ లెటర్లు తీసుకువెళ్లే వాళ్ల గురించి మనకు తెలుసు. కానీ, సినిమా టికెట్ల కోసం రికమండేషన్ లెటర్లతో వెళ్లే వాళ్లుంటారంటే ఆశ్చర్యమేస్తుంది. ఆ ఆశ్చర్యానికి కేరాఫ్ గా నిలిచిన ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే, అది ‘కబాలి’ కనుక! చెన్నై సచివాలయంలోని సమాచార, ప్రచారశాఖ విభాగంలో పనిచేసే సీనియర్ అధికారి ఒకరు అక్కడి అభిరామి థియేటర్ కు ఒక లేఖ రాశారు. 22-07-2016వ తేదీన విడుదలయ్యే ‘కబాలి’ చిత్రం ఫస్ట్ షోకు 10 టికెట్లు ఇవ్వాలంటూ ఆ థియేటర్ మేనేజర్ కు రాసిన ఒక సిఫారసు లేఖలో కోరారు. ఈ లేఖపై అధికారి సంతకం, ముద్ర కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. మరో విషయమేమిటంటే, ‘కబాలి’ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా చెన్నైలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడమే కాకుండా, వాళ్లకు సినిమా టికెట్లు కూడా ఇచ్చాయి. ఒక్కో టికెట్ రూ.500 చొప్పున 200 టికెట్లను కాగ్నిజెంట్ సంస్థ తమ ఉద్యోగుల కోసం ఈ నెల 16న కొనుగోలు చేసింది. సర్వీస్ ఛార్జీలు సహా మొత్తం రూ.1,02,500 అయినట్లుగా ఏజీఎస్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఒక రశీదు కూడా ఇచ్చింది. రేపు మ్యాట్నీ షో కోసం ఈ టికెట్లు బుక్ చేసినట్లు ఆ రశీదులో ఉంది. సమాచార, ప్రచార శాఖ అధికారి సిఫారసు లేఖ, ఏజీఎస్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన రశీదు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుండటం కొసమెరుపు.

  • Loading...

More Telugu News