: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. విద్యార్థినిని తరగతి గదిలోనే కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి తపాల్‌లోని డీడీఎస్ డిగ్రీ కాలేజీలో 18 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల నేహా శర్మ అనే విద్యార్థినిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత తాను కూడా తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఈరోజు ఉదయం కాలేజీలో విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షలు రాస్తోన్న నేహా శర్మ వద్దకు వచ్చిన 18 ఏళ్ల సందీప్ మలాన్ మొదట ఆమె పక్కన కూర్చున్నాడు. ఈ అంశాన్ని తరగతిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యంగా చూశారు. యువకుడు నేహా పక్కన కూర్చున్న విషయాన్ని గురించి వారు ఆరా తీసే లోపే ఆ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తరగతి గదిలో వారిద్దరు చనిపోయిన ఘటన పట్ల విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సందీప్ మలాన్ ని స్థానిక వెటర్నరీ వైద్యుడి కుమారుడిగా గుర్తించారు. నేహా, సందీప్ లకు ఇంతకు ముందే పరిచయం ఉందని పోలీసులకి తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.