: పైరసీని ప్రోత్సహించడం ఓ చెడు ప్రవర్తనే : ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ 'క్వీన్'
సినీ పరిశ్రమను వెంటాడుతోన్న పైరసీ భూతం పట్ల బాలీవుడ్ నటులు మండిపడుతున్నారు. పైరసీ సినీ పరిశ్రమకు పెద్ద ముప్పుగా తయారయిందని అంటున్నారు. షారుక్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, దర్శకుడు ఇంతియాజ్ అలీ తాజాగా పైరసీని అరికట్టాల్సిందేనని ఇటీవల అన్నారు. ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి చిత్రాలు పైరసీ భూతం బారిన పడి థియేటర్‌ల కన్నా ముందుగా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. పైరసీ సినీ రంగానికి పెద్ద చేటని కంగనా పేర్కొంది. సినిమా కోసం ఎంతో మంది కష్టపడి పనిచేస్తారని, పైరసీ అనేది ఒక రకమైన అతిక్రమణ అని కంగనా ఆందోళన వ్యక్తం చేసింది. పైరసీ చేసే వారు వెంటనే వారు చేసే అతిక్రమణను ఆపేయాలని ఆమె కోరింది. ఈ అంశాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదని సూచించింది. పైరసీని ప్రోత్సహించడం ఓ చెడు ప్రవర్తనగా ఆమె అభివర్ణించింది.