: అమెరికా పోలీసుల అదుపులో ఆంధ్రా పాస్టర్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
అమెరికాలో అదృశ్యమయ్యాడని భావిస్తున్న కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన పాస్టర్ జాన్సన్ చౌదరి ఆచూకీ లభ్యమైంది. గత నెలలో అమెరికా వెళ్లిన జాన్సన్ చౌదరి ఈ నెల 13న భారత్ కు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన ఎంతకీ రాకపోవడంతో పాటు, ఆయన ఫోన్ కూడా పని చేయలేదు. అదే సమయంలో, అమెరికాలో నల్లజాతి వారి ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, ఆయన ఆచూకీ లేదంటూ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీస్తున్నంతలో ఆయనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం విశేషం. అయితే, తాను అమెరికా పోలీసుల అదుపులో ఉన్నానని, ఓ కేసు విచారణలో భాగంగా తనను అమెరికా పోలీసులు విచారిస్తున్నారని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కాగా, అతనిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? కేసు ఏంటి? అనే వివరాలు తెలియకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.