: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా పటిష్ఠంగా ఉంది: జాసన్ హోల్డర్
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా టీమిండియా పటిష్ఠంగా ఉందని వెస్టిండీస్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలిపాడు. తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంటిగ్వాలో హోల్డర్ మాట్లాడుతూ, తాను గతంలో రెండు, మూడు టెస్టుల సిరీస్ లు ఆడానని అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో ఆడడం ఇదే తొలిసారని చెప్పాడు. తమ జట్టుకు అనుభవజ్ఞుల కొరత ఉందని చెప్పాడు. జట్టులో కొత్తవాళ్లు, కుర్రవాళ్లు ఎక్కువ మంది ఉన్నారని తెలిపాడు. టీమిండియాను అడ్డుకోవడం సవాలేనని చెప్పిన హోల్డర్, గతంలో ఆస్ట్రేలియాతో అనుభవలేమి వల్లే ఓటమిపాలయ్యామని అన్నాడు. అయితే గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నామని తెలిపాడు. ఇక్కడి పిచ్ లు మందకొడిగా ఉంటాయని, వీటిపై రాణించాలంటే చాలా శ్రమించాలని జాసన్ హోల్డర్ అభిప్రాయపడ్డాడు.