: ఎవరికీ కనిపించని పవిత్ర 'సరస్వతి'... ఈ నెలలోనే కంటి ముందుకు రానుంది!


ఇండియాలో త్రివేణి సంగమం అనగానే గంగా, యమునా, సరస్వతి నదులు గుర్తొస్తాయి. అలహాబాద్ లో ఉన్న ఆ పవిత్ర ప్రదేశాన్ని త్రివేణి సంగమంగా చెప్పుకుంటాము. గంగా, యమునలు బయటకు కనిపిస్తుంటాయిగానీ, సరస్వతి నది మాత్రం ఎక్కడా కనిపించదు. ఈ నది అంతర్వాహిని అని, భూమి లోపల ప్రవహించే పవిత్ర నది అని చెప్పుకుంటుంటాం. వేదకాలంలో భూ ఉపరితలంపైనే ప్రవహించిన సరస్వతి నది కాలక్రమంలో భూగర్భంలోకి వెళ్లిపోయిందన్నది భారతీయుల నమ్మకం. ఇక హర్యానా ప్రభుత్వం సిద్ధం చేసిన తాజా నివేదిక ప్రకారం, కంటికి కనబడకుండా పోయిన సరస్వతి నది ఈ నెలలోనే బయటకు రానుంది. ఈ నది ప్రవహించిన దారిని ఊహిస్తున్న సరస్వతి హెరిటేజ్ డెవలప్ మెంట్ బోర్డు ఓ ప్రతిపాదన చేయగా, అందుకు ప్రభుత్వం అనుమతించింది. దాదుపూర్ ఫీడర్ ద్వారా ఉంచా చందనా గ్రామం వద్ద భారీ ఎత్తున నీటిని గుమ్మరిస్తే, అది నదీ మార్గాన్ని చూపుతుందని, తాము ఊహిస్తున్నట్టు, ఈ నది యమునానగర్, కురుక్షేత్ర, ఖైతాల్ జిల్లాల ద్వారా ప్రవహిస్తుందని అధికారులు అంటున్నారు. ఈ నెల 30న నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే తాము అనుకుంటున్న దారిని శుభ్రపరిచామని తెలిపారు. ఇక నది మార్గం స్పష్టమైతే, మార్గ మధ్యంలోని ఆదిభద్రి వద్ద డ్యామ్ ను నిర్మించే ఆలోచన ఉందని, దీని ద్వారా కోల్పోయిన నదిని తిరిగి భూమిపైకి తెచ్చినట్లవుతుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. కాగా, కుమావోన్ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ కేఎస్ వల్దియా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కమిటీ వేదకాలం నాటి సరస్వతి నదీ మార్గాన్ని గుర్తించింది.

  • Loading...

More Telugu News