: ఏపీ ‘హోదా’కు తమిళ పార్టీ మద్దతు!... కేవీపీ బిల్లుకు మద్దతిస్తామన్న కనిమొళి!
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు మరింత మద్దతు లభించింది. ఇప్పటికే బీజేపీ మినహా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ సహా అన్ని పార్టీలు కేవీపీ బిల్లుకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సభలో ప్రైవేటు బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని తీర్మానించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్నటి నుంచి పలు పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ, ఆ పార్టీ అధినేత కరుణానిధి కూతురు కనిమొళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. తమ బిల్లుకు మద్దతివ్వాలని వారు ఆమెను కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కనిమొళి... సభలో బిల్లు ఓటింగ్ కు వస్తే అనుకూలంగా ఓటేస్తామని హామీ ఇచ్చారు.