: సదావర్తి భూములపై నోరువిప్పిన చంద్రబాబు!... గుళ్లు, గోపురాలను అమ్మే దరిద్రం విపక్షానిదేనని కామెంట్!
ఏపీలో విపక్షానికి చిక్కిన ఆరోపణాస్త్రం సదావర్తి భూముల వేలంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోరు విప్పారు. నిన్న రాత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... విపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణలపై విరుచుకుపడ్డారు. గుళ్లు, గోపురాలు అమ్ముకునే దరిద్రం వైసీపీదేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్విస్ ఛాలెంజ్ అంటే ఏమిటో తెలియని వారు కూడా రాజధాని నిర్మాణ టెండర్లపై ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. చెన్నై సమీపంలోని సదావర్తి భూముల విలువ రూ.900 కోట్ల విలువ ఉందని చెబుతున్న విపక్షాలు... అందులో ఒక్క శాతం సొమ్మును చెల్లించి వేలంలో పాల్గొనాలని సవాల్ చేసినా ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కనీసం రూ.5 కోట్లు ఇవ్వాలని సీఎం స్థాయిలో ఆఫర్ ఇచ్చినా... స్పందించనప్పుడు చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తప్పుడు వార్తలు రాసే వారిని కూడా వదలబోమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.