: ‘కబాలి’ని వెంటాడుతున్న కోర్టు కష్టాలు!... రజనీ చిత్రం విడుదలపై ఉత్కంఠ!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ని కోర్టు వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా నిన్న అదే కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రజనీ గతంలో నటించిన చిత్రం ‘లింగా’ పంపిణీదారులు వేసిన ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చిత్రం రేపు విడుదల కానున్న నేపథ్యంలో నేటి కోర్టు విచారణ జరుగుతుండటంపై రజనీ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. లింగా చిత్రం నష్టాలను పూడ్చేస్తామంటూ హామీ ఇచ్చిన రజనీ, చిత్ర నిర్మాత కలైపులి థాను... తమ హామీని నిలబెట్టుకోలేదని, ఈ కారణంగా ‘కబాలి’ విడుదలను ఆపేయాలని పంపిణీదారులు తమ పిటిషన్ లో కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రజనీ సహా కలైపులి థానులకు నోటీసులు జారీ చేసింది. లింగా పంపిణీదారుల వాదనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే ‘కబాలి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే దీని విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆయా థియేటర్లలో చాలా షోలకు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడుబోయాయి. దీంతో కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.