: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పదట!... తేదీలు చెప్పకుండా దాటేసిన చంద్రబాబు!
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నిన్న కొంతమంది కేబినెట్ సహచరులు, పలువురు ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం పేరిట నిర్వహించిన భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పదన్న చంద్రబాబు... ఎప్పుడు జరుపుతామన్న విషయాన్ని మాత్రం దాటవేసి ఆశావహుల్లో ఉత్కంఠకు తెర తీశారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సహా 25 మంది దాకా ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు కేబినెట్ విస్తరణ ప్రస్తావన తెచ్చారు. ‘‘ఇప్పుడు మంత్రివర్గంలో 20 మంది ఉన్నారు. ఇంకా ఇద్దరో, ముగ్గురో రావడానికి అవకాశముంది. అందుచేత పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే కేబినెట్ విస్తరణను ఎప్పుడు చేపట్టనున్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేపడతారంటూ సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు అడగలేకపోయారు. అయితే మునిసిపల్ ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివరలో (డిసెంబర్ లో) ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.