: నేనెన్నడూ ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు: మాయావతి


తాను ఎన్నడూ, ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఆమెపై బీజేపీ యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఈరోజు రాజ్యసభలో బీఎస్పీ ఎంపీలు సహా విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ, ఈ విషయంలో తనకు అండగా నిలిచిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర పార్టీల నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నడూ, ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ భావజాలాల పరంగానే తాను ఎవరిపైనయినా విమర్శలు చేశానని అన్నారు. తనను అందరూ బెహన్ జీ అని పిలుస్తారని, అలాంటి తనపై బీజేపీ నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరమని మాయావతి పేర్కొన్నారు. కాగా, మాయావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని రాజ్యసభలో బీఎస్పీ, ప్రతిపక్ష సభ్యులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News