: రాజ్యసభను కుదిపేసిన దళితులపై దాడి ఘటన... సభ రేపటికి వాయిదా


తీవ్ర గందరగోళం నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. గుజరాత్ లో ఆవు చర్మాలు రవాణా చేస్తున్నారన్న నెపంతో దళితులను కారుకు కట్టేసి కొట్టిన ఘటన పార్లమెంటును కుదిపేసింది. రాజ్యసభలో బహుజన సమాజ్ పార్టీ నేతలు పలు మార్లు పోడియంలోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో స్పందించిన డిప్యూటీ ఛైర్మన్ ఇలాంటి ఘటనలు దేశానికి మచ్చలాంటివని, అయితే ఘటన జరిగిపోయింది కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చిద్దామని ప్రతిపాదించారు. దీనిపై అధికార బీజేపీ సభ్యులు మాట్లాడుతూ, ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారని, ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని హోం మంత్రి ప్రకటించారు. దీంతో మరోసారి బీఎస్పీ నేతలు ఆగ్రహంతో పోడియంను చుట్టుముట్టారు. ఎన్నాళ్లిలా విచారం వ్యక్తం చేస్తారు? ఖండిస్తారు? అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ లో దళితులపై దాడులకు దిగిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి డిప్యూటీ ఛైర్మన్ సర్ది చెబుదామని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News