: లోక్‌సభలో ఓవైపు గందరగోళం.. వాడీవేడీ చర్చ.. మరోవైపు హాయిగా కునుకుతీసిన రాహుల్‌గాంధీ
ఓ వైపు గుజరాత్‌లో ఇటీవల జరిగిన ‘దళితులపై దాడి’ ఘటనపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి తీవ్రంగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం హాయిగా కునుకుతీశారు. రాహుల్‌గాంధీ సభలో కునుకు తీస్తున్న దృశ్యాలు అక్కడి కెమెరాకు చిక్కాయి. దీంతో రాహుల్‌గాంధీ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం దళితులపై నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరూ గరం గరంగా ఉంటే రాహుల్ మాత్రం కూల్‌గా కునుకు తీయడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. సీసీ టీవీ ఫుటేజీల్లోనూ రాహుల్ తీరు చిక్కినా.. ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి రాహుల్‌ని సమర్థించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ సభలో రాహుల్ అసలు నిద్రపోలేదని, ఆయన కిందికి చూస్తున్నారని వ్యాఖ్యానించారు.