: కేవీపీ బిల్లుతో ఒరిగేదేమీ లేదు... అయినా మద్దతిస్తామన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా!
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఏపీలో అధికార పార్టీ టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇప్పటికే మొన్న జరిగిన కేబినెట్ లో ఈ అంశంపై జరిగిన చర్చలో బిల్లుకు అనుకూలంగానే ఓటేయాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు బోండా ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు ముఖ్యమైనదేదీ లేదని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే కేవీపీ బిల్లుతో ఒరిగేదేమీ లేదని కూడా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయినా రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనన్న విషయాన్ని ఎవరూ మరిచిపోలేదని కూడా బోండా వ్యాఖ్యానించారు.