: ఆ ఆస్తుల వివాదంలో నేను ఎలాంటి తప్పూ చేయలేదు: సచిన్ టెండూల్కర్
వ్యాపారవేత్త సంజయ్ నారంగ్, లాండోర్ కంటోన్మెంట్ లో చేపట్టిన అభివృద్ధి పనుల వెనక తనకు ఎలాంటి సంబంధమూ లేదని, ఎలాంటి ఆర్థికపరమైన ప్రయోజనాలనూ పొందలేదని, ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి నుంచి ఓ ప్రకటన వెలువడింది. తాను ఇండియాలోని చట్టానికి నిత్యమూ కట్టుబడి వుండే వ్యక్తినని చెప్పారు. డీఆర్డీఓ నిర్మాణాల పక్కనే ఉన్న ప్రాంతంలో నెలకొన్న వివాదంలో సచిన్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచిన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. కాగా, అసలు నారంగ్ తో సచిన్ కు ఉన్న వ్యాపార సంబంధం ఏంటన్న విషయాన్ని మాత్రం ఇందులో వెల్లడించలేదు. అయితే, లాండోర్ కంటోన్మెంట్ లో 'దహిలా బ్యాంక్' పేరిట నారంగ్ కు ఆస్తులుండగా, అందులో సచిన్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సచిన్ కేవలం వ్యక్తిగత స్నేహితుడు మాత్రమేనని, గతంలోనూ, ఇప్పుడు దహిలా బ్యాంకులో ఆయనకు ఎలాంటి వాటాలు లేవని నారంగ్ మరో ప్రకటనలో తెలిపారు.