: జైట్లీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసిన కేవీపీ!... హోదాపై ‘ప్రైవేటు’ బిల్లు ఆమోదం బాధ్యత బీజేపీదేనని లేఖాస్త్రం!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చకు సమయం సమీపిస్తున్న కొద్దీ దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత జరగనున్న ఓటింగ్ లో బిల్లుకు ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. బిల్లుపై ఇప్పటికే బీజేపీ వైఖరి వెల్లడి కావడంతో ఆ పార్టీని టార్గెట్ చేస్తూ కేవీపీ వ్యూహాత్మక అడుగు వేశారు. ఏపీ పునర్విభజన బిల్లు సందర్భంగా రాజ్యసభలో నాడు జరిగిన పరిణామాలను వివరిస్తూ కేవీపీ... బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం రాజ్యసభ నాయకుడి హోదాలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన ఓ లేఖ రాశారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో జరిగిన చర్చలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందేనని బీజేపీ నేత వెంకయ్యనాయుడు చేసిన డిమాండ్, పలు పార్టీల నేతలు చేసిన వాదనల కాపీలతో పాటు తాను రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు కాపీలను కేవీపీ ఆ లేఖకు జత చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చలో బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ నేతగా, ప్రస్తుతం సభా నాయకుడి హోదాలో జైట్లీపైనే ఉందని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. వెరసి రాజ్యసభలో తాను ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం బాధ్యత బీజేపీదేనని ఆ లేఖలో కేవీపీ చెప్పారు.

  • Loading...

More Telugu News