: విచారణ జరిపించాల్సిందే.. కారకులను శిక్షించాల్సిందే.. 'ఎంసెట్ 2' పేపర్ లీకేజీపై ఆందోళనలు
తెలంగాణ 'ఎంసెట్ 2' పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్‌టీయూలోని తెలంగాణ ఎంసెట్ భవనం ఎదుట ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్యలను తీర్చడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీకేజీపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థుల సమస్యను పూర్తిగా పరిష్కరించేవరకు తమ పోరాటం ఆపబోమని అంటున్నారు.