: ఇద్దరూ ఇద్దరే... ట్రంప్ అధ్యక్షుడైతే మోదీ మంచి మిత్రుడిగా మారుతారు... ఆపై ప్రపంచానికే మార్గ నిర్దేశం: యూఎస్ మాజీ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్
అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే, ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత దగ్గరి స్నేహితుడవుతారని, ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించే నేతలని యఎస్ మాజీ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇద్దరూ లక్ష్య సాధనకు ఎంత దూరమైనా వెళ్లే నేతలని అభిప్రాయపడ్డ ఆయన, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ లు మిగతా ప్రాంతాన్ని సురక్షితంగా, ఉత్తమ నివాసయోగ్యాలుగా మార్చేలా దిశానిర్దేశం చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. వీరిద్దరి సహజ లక్షణాలూ ఒకటేనని అన్నారు. ప్రజలను ఏకతాటిపై నడిపించేందుకు వీరి వద్ద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఓ డీల్ ఎలా నడపాలో, తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో ఇద్దరు నేతలకూ తెలుసునని, అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై, ఆపై భారత ప్రధానితో కలసి ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వేళ, వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారని జోస్యం చెప్పారు. ఇద్దరిలో స్వీయ విశ్వాసం అధికమని వ్యాఖ్యానించారు. మోదీపై పొగడ్తలు గుప్పించిన గింగ్రిచ్, గుజరాత్ ను ఆయన ఎలా మార్చిందీ గుర్తు చేసుకున్నారు. ఇటీవల యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు వచ్చిన ఆయన్ను కలుసుకున్నానని తెలిపారు. రిపబ్లికన్లలో హిందువులు అధికసంఖ్యలో ఉన్నారని, వారంతా ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారని, ఇది అమెరికా భవిష్యత్తుకు, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు అత్యంత కీలకమని అన్నారు.