: యూఏఈకి అమెరికా రూ. 5,250 కోట్ల విలువైన బాంబుల విక్రయం!
తమకు దీర్ఘకాలంగా మిత్రదేశంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు భారీ ఎత్తున బాంబులను విక్రయించేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై పోరాడేందుకంటూ 785 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,250 కోట్లు) విలువైన బాంబులను విక్రయించనున్నట్టు పెంటగాన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అమెరికా విదేశీ వాణిజ్య విధానానికి, ఆయుధాల విక్రయ చట్టానికి అనుగుణంగా డీల్ కుదిరిందని, అభ్యంతరాలుంటే ప్రజా ప్రతినిధులు 30 రోజుల్లోగా తెలుపవచ్చని పేర్కొంది. ఇరు దేశాల మధ్యా కుదిరిన డీల్ లో భాగంగా 14,640 బాంబులు, వాటి గైడెన్స్ కిట్లు, నావిగేషన్ కు సంబంధించిన సాంకేతికతలను అందించనుంది. ఉగ్రవాదులపై పోరుకు నమ్మకమైన అరబ్ దేశం యూఏఈయేనని భావిస్తున్న అమెరికా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ను రూపుమాపాలంటే ఆ దేశం సహకారం తప్పనిసరన్న కోణంలోనే ఈ డీల్ కుదుర్చుకున్నట్టు అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే యూఏఈలోని అల్ దాఫ్రా ఎయిర్ బేస్ కేంద్రంగా 3,500 మంది అమెరికన్ సైన్యం, యుద్ధ విమానాలు ఐఎస్ఐఎస్ పై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.