: ఇక అచ్చెన్న వంతు!... బిజినెస్ సమ్మిట్ కోసం మలేసియా వెళ్లిన ఏపీ మంత్రి!
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అదే కోవలో ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా గతంలో అమెరికాలో పర్యటించారు. ఇక చంద్రబాబు వెంట ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హోదాలో పరకాల ప్రభాకర్, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఆయా దేశాలకు వెళుతూ తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా చేరిపోయారు. మలేసియాలో ‘ఆసియాన్- ఇండియా బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్’ పేరిట జరగనున్న వాణిజ్య సదస్సులో ఆయన ఏపీ ప్రతినిధిగా పాల్గొంటున్నారు. ఈ మేరకు నిన్ననే ఆయన గన్నవరంలో మలేసియా ఫ్లైటెక్కేశారు. అచ్చెన్న వెంట ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ కృష్ణకిశోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ లు కూడా మలేసియా బయలుదేరి వెళ్లారు.