: చవితికి వారం రోజుల ముందే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం.. చకచకా కొనసాగుతోన్న ఏర్పాట్ల విశేషాలు ఇవిగో!
దేశవ్యాప్తంగా పేరు గాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది గతేడాది కన్నా ఒక అడుగు తగ్గి 58 అడుగుల ఎత్తుతో ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈసారి ఈ వినాయకుడు 28 అడుగుల వెడల్పుతో దర్శనమివ్వనున్నాడు. 45 టన్నులు ఉండనున్న ఈ భారీ గణేశుడిని రూపుదిద్దే పని శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో చకచకా కొనసాగుతోంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం 20 టన్నుల స్టీల్‌ని ఉపయోగిస్తున్నారు. ఒక్కోటీ 50 కేజీలు ఉండే 1750 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాగులని విగ్రహ తయారీకి వాడుతున్నారు. దీనిలో రసాయనం కేవలం ఒక్కశాతమే ఉంటుందట. వీటిని ప్రత్యేకంగా తమిళనాడులో సముద్రపు గవ్వల నుంచి తయారు చేశారట. ఇంకా గుజరాత్ నుంచి ఒక్కో బ్యాగు 35 కేజీల బరువుండే 200 బంకమట్టి బ్యాగులు తీసుకొచ్చారు. 45 బండిల్స్ నార, 150 లీటర్ల వాటర్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. భారీ గణేశుడు 11 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వడానికి అనువుగా వేసే షెడ్డు కోసం నర్సాపూర్ నుంచి 25 టన్నుల సర్వీ కర్రని వాడుతున్నారు. అంతేగాక, 50 బండిళ్ల కొబ్బరి తాడుతో నిర్మించిన 60 అడుగుల షెడ్డును కూడా ఆ పక్కకే వేయనున్నారు. వీటి కోసం కమిటీకి అయ్యే ఖర్చు రూ.55 లక్షలు. ఈ షెడ్డు ఏర్పాటు చేయడానికి 15 రోజుల పాటు శ్రామికులు పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుధాకర్ ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణ పనిజరిగింది. అంతేగాక వెల్డింగ్ పనుల కోసం 12 మంది శ్రామికులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనుల కోసం 25 మంది శ్రామికులు, విగ్రహం ఫినిషింగ్ వర్క్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 25 మంది కళాకారులు శ్రమించనున్నారు. మౌల్డింగ్ పనులను హైదరాబాద్‌కి చెందిన 20 మంది శ్రామికులు చేస్తున్నారు. విగ్రహానికి చేసే పెయింటింగ్ కోసం కాకినాడ నుంచి భీమేష్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు శ్రమించనున్నారు. ఇంతమంది శ్రామికులు, కళాకారులు కలిసి పనిచేస్తే మన భారీ గణనాథుడు కొలువుదీరుతాడు. అయితే ఈసారి మహాగణపతి పొడవు తగ్గుతున్నట్లే ఆయనకు పెట్టే లడ్డూ బరువు భారీగా తగ్గనుంది. గత ఐదు సంవత్సరాలుగా 2400 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న లడ్డూనే ఖైరతాబాద్ గణేశుడి చేతిలో మనం చూస్తున్నాం. అయితే ఈసారి మాత్రం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు నుంచి 500 కేజీల లడ్డూ అందనుంది. చవితికి వారం రోజుల ముందే ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవచ్చు.