: నరేంద్ర మోదీని కలిసిన కేసీఆర్ కు మిగిలింది నిరాశే!
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న కేసీఆర్, హైకోర్టు విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీని పొందలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన టీఆర్ఎస్ నేతల వద్ద ప్రస్తావించి నిరాశను వ్యక్తం చేసినట్టు 'దక్కన్ క్రానికల్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పార్లమెంటు హౌస్ లో ప్రధానితో అరగంట పాటు సమావేశమైన ఆయన, హైకోర్టు విభజన గురించి గట్టిగా అడుగగా, పరిశీలిస్తామని మాత్రమే మోదీ వెల్లడించారని, అంతకుమించి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టేందుకు ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. హైకోర్టు విభజన గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ను, మోదీ ఇతర సమస్యలపై వివరాలు అడిగినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారుల నిరసనలను, ఆపై సస్పెన్షన్లను ప్రస్తావించిన ఆయన, పరిస్థితి మరింతగా దిగజారకుండా, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు వ్యక్తిగతంగా కల్పించుకోవాలని కోరినప్పటికీ, ప్రధాని మౌనంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మిషన్ భగీరథ గురించి విన్నానని, ఇది అద్భుతమైన ప్రోగ్రామని కొనియాడిన మోదీ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలను స్వయంగా ప్రస్తావించి, హైకోర్టు విభజన అంశాన్ని పక్కన పెట్టినట్టు 'దక్కన్ క్రానికల్' ఈ కథనంలో పేర్కొంది.