: విచారణకే రాహుల్ మొగ్గు!... సారీ చెప్పేది లేదంటున్న కాంగ్రెస్ పార్టీ!
మహాత్మా గాంధీ హత్య ఆరెస్సెస్ పనేనంటూ వ్యాఖ్యానించి ఇబ్బందుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు విచారణకే మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించిన మేరకు రాహుల్ గాంధీ ఆరెస్సెస్ కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా నిన్న ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో కోర్టు విచారణకే రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని... సారీ చెప్పే బదులు కోర్టు ఎదుట చారిత్రక సత్యాలకు సంబంధించిన ఆధారాలను ఉంచనున్నామని ఆయన చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమని ఆయన వ్యాఖ్యానించారు. తమ వైఖరిని రాహుల్ తో పాటు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా సరైన వేదిక మీద వెల్లడిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.