: జగన్ ఈ జన్మలో సీఎం కాలేరట!... జోస్యం చెప్పిన పల్లె రఘునాథరెడ్డి!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికెళ్లినా... త్వరలోనే తాము అధికారంలోకి వస్తామని, ప్రజల కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. ఒకట్రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని మొన్న విశాఖ జిల్లాలో ప్రకటించిన జగన్... ఆ వెంటనే తాను అధికారంలోకి వస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ ఈ జన్మకు సీఎం కాలేరని ఆయన తేల్చిచెప్పారు. నిన్న రాత్రి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రఘునాథరెడ్డి... జగన్ కామెంట్లపై సెటైర్లు సంధించారు. ‘‘ముఖ్యమంత్రి పదవి కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ పగటి కలలు కంటున్నారు. ఎన్ని గడపలు తట్టినా... ఎన్ని యాత్రలు చేసినా ఈ జన్మకు ఆయన సీఎం కాదు కదా ఎంపీ, ఎమ్మెల్యే కూడా కాలేరు’’ అని పల్లె జోస్యం చెప్పారు.