: అమెరికా అధ్యక్ష బరిలో మా అభ్యర్థి ట్రంపే!... అధికారికంగా ప్రకటించిన రిపబ్లికన్ పార్టీ!
అగ్రరాజ్యం అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారి, రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్రంప్ ను తన అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీకి చెందిన అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్... ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, న్యూయార్క్ రిప్రజెంటేటివ్ క్రిస్ కొలిన్స్, సౌత్ కరోలినా లెఫ్ట్ నెంట్ గవర్నర్ హెన్రీ మ్యాక్ మాస్టర్ లు బలపరిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసం టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ తో పోటీ పడిన ట్రంప్ 1,237 డెలిగేట్ల మద్దతు దక్కించుకుని సంపూర్ణ మద్దతు సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నే ఆ పార్టీ బరిలోకి దింపుతోంది.