: తాగుబోతు భర్తకు భార్యామణి శిక్ష... భర్త కళ్లకు 'ఫెవీ క్విక్' పెట్టింది!
వస్తువులను అతకడానికి ఉపయోగించే 'ఫెవీ క్విక్' గమ్ ను తాగుబోతు భర్తపై ప్రయోగించి షాక్ ఇచ్చిందో భార్య. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని రెవా జిల్లాలో సంతోష్ విశ్వకర్మకు విజయలక్ష్మితో వివాహం జరిగింది. తాగుడుకు బానిసైన విశ్వకర్మ నిత్యం తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. అతడి ఆగడాలు భరించలేకపోయిన విజయలక్ష్మి...పూటుగా తాగి వచ్చిన సంతోష్ విశ్వకర్మ నిద్రపోయేవరకు వేచి చూసింది. అతను నిద్రలోకి జారుకున్న అనంతరం అతని కళ్లకు ఫెవీ క్విక్ అంటించి పుట్టింటికి వెళ్లిపోయింది. తెల్లవారి లేచి చూసిన సంతోష్ విశ్వకర్మ కళ్లు తెరుచుకోకపోవడంతో భార్యను పిలిచాడు. ఎంతకూ ఆమె రాకపోవడంతో నెమ్మదిగా లేచి కళ్లపై నీళ్లు చల్లుకున్నాడు. అయినా కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పొరుగువారి సహకారంతో వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. వారు అతని కళ్లదగ్గర వేడి పుట్టించడం ద్వారా ఫెవీ క్విక్ ను తొలగించారు. ఇప్పుడు తనకి చూపు వచ్చినప్పటికీ ఎదురుగా భార్య లేకపోవడంతో తెగ బాధపడిపోతున్నాడు ఆ తాగుబోతు భర్త.