: బీజేపీకి మరో షాక్... 'ఆప్' గూటిలో చేరనున్న బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తీ ఆజాద్ భార్య
బీజేపీకి మరో షాక్ తగలనుంది. రెండు నెలల క్రితం ఏరికోరి రాజ్యసభ సభ్యత్వం కల్పించిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని వార్తలు వెలువడుతున్నాయి. దీని నుంచి తేరుకునేందుకు బీజేపీ ఆయన గతంలో ఆప్ పై చేసిన విమర్శల వీడియోలు వెలుగులోకి తెచ్చి కసి తీర్చుకుంటోంది. ఇంతలో బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తీ ఆజాద్ ను గత ఏడాది పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య పూనమ్ ఆజాద్ గతంలో బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆమె పార్టీకి రాజీనామా చేసి, ఆప్ లో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె నిర్ణయం తీసుకున్నారని, ఆప్ లో చేరికే ఆలస్యమని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై కీర్తీ ఆజాద్ మాట్లాడుతూ, తన భార్యకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉందని అన్నారు. ఆమె తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా దేశానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. బహిష్కృత ఎంపీగా ఈ వార్తలపై తాను స్పందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.