: పంచాయతీ నిర్ణయాన్ని ఎదిరించినందుకు కుటుంబానికి సాంఘిక బహిష్కరణ!
శ్రీకాకుళం జిల్లా దుక్కివానిపేటలో ఓ కుటుంబానికి సాంఘిక బహిష్కరణ విధించడం కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ లోని పల్లెల్లో స్కూలు, లేదా హాస్టల్ నిర్వహించాలంటే కనిష్ట విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్య కంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూలు, లేదా హాస్టల్ ను రద్దు చేస్తుంది. దీంతో ఆ గ్రామంలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దుక్కివానిపేటలో ఇలాంటి పరిస్థితి రాకుండా గ్రామ బాలలంతా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించాలని పంచాయతీ నిబంధన విధించింది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో పర్యవేక్షణ ఉండదని, పాఠాలు చెప్పినా చెప్పకున్నా విద్యార్థులకు మార్కులు వేస్తే జీతాలు వచ్చేస్తాయనే భావనతో టీచర్లు పాఠాలు సరిగా చెప్పరని భావించిన సుజాత అనే మహిళ తన పిల్లలకు మంచి విద్యనందించాలన్న భావనతో దగ్గరలో ఉన్న పలాసలోని ఓ ప్రవేట్ స్కూలులో జాయిన్ చేసింది. దీంతో ఆమెను పంచాయతీ పెద్దలు వారించారు. ఇలాంటి నిర్ణయం వల్ల మిగతా వారు కూడా అదే మార్గంలో పయనిస్తారని, తద్వారా గ్రామం నుంచి స్కూలు తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య లభించదని చెప్పిన సుజాత తన నిర్ణయం మార్చుకునేందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె కుటుంబానికి సాంఘిక బహిష్కణ శిక్ష విధిస్తున్నట్టు పంచాయతీ ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడితే, వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఇది అక్కడ పెను కలకలం రేపింది.