: పోలీసులను ఆశ్రయించిన 'షార్ట్ ఫిలింస్' హీరోయిన్... తన భర్తను తనకు ఇవ్వాలంటూ డిమాండ్
రొమాంటిక్ షార్ట్ ఫిలింస్ లో హీరోయిన్ గా నటించే సిరిప్రియ (చంద్రకళ) తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులను ఆశ్రయించింది. సామర్లకోటకు చెందిన ప్రసన్నకుమార్ అనే యువకుడిని వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నానని, అతని కుటుంబ సభ్యులు తమ ప్రేమ వివాహాన్ని అంగీకరించడం లేదని, తన భర్తను తన నుంచి వేరు చేసేందుకు చూస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తాను జీవనం కోసం షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నానని చెప్పింది. సినిమాల్లో ఉండే వాళ్లంతా తప్పులు చేస్తూ బతకరు అని చెప్పిన ఆమె, అంతా మంచివాళ్లే ఉండరని కూడా చెప్పింది. తాను అందరూ అనుకునేలా చెడ్డదానిని కాదని, తనను తాను నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని తన భర్త కుటుంబ సభ్యులను కోరుతున్నానని ఆమె తెలిపింది. తనను కోడలిగా చేసుకోవడం ఇష్టం లేకపోతే తన భర్తను, తనను వదిలేయాలని, తామిద్దరం వేరుగా బతుకుతామని, తమకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి హాని కలగకూడదని హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తాము ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆమె చెప్పింది. కాగా, ప్రసన్నకుమార్ పై సామర్లకోట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదై ఉండడంతో రెండు రోజుల క్రితం అతనిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ఈ వివాదం వెలుగు చూసింది. ప్రసన్న కుమార్ కూడా ఈమెతో కలిసి జీవించేందుకు మొగ్గు చూపుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం అభ్యంతరం చెప్పడం విశేషం.