: డీకే అరుణ పాదయాత్ర ప్రారంభం.. గద్వాల జిల్లా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వ్యాఖ్య
గద్వాలను జిల్లా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ గద్వాలలోని జమ్మిచేడు గ్రామ జములమ్మ ఆలయం నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. అన్ని అర్హతలూ ఉన్న గద్వాలను జిల్లాగా చేయాల్సిందేనని ఆమె అన్నారు. గద్వాల జిల్లాను సాధించడం కోసం ప్రభుత్వం ఇదే తీరు కనబరిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో కేసీఆర్ వనపర్తిని జిల్లా చేయాలని యోచిస్తున్నారని, గద్వాల ప్రజల ఆకాంక్షను గుర్తించి ఆ మండలాన్నే జిల్లాగా చేయాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ.. గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా కోసం ప్రజలు ఏడాది నుంచి పోరాడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆందోళనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అక్కడి ప్రజలపై ప్రభుత్వం కనబరుస్తోన్న తీరుకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.