: వారం రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ బాధితురాలి కథనం!
13 తేదీన హర్యానాలోని రోహ్ టక్ లో గ్యాంగ్ రేప్ కు గురై రోడ్డుపై పడి ఉన్న యువతి జరిగిన దారుణంపై వాంగ్మూలమిచ్చింది. ఆమె వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే... "హర్యానాలోని రోహ్ టక్ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఉదయం 9 గంటలకు కాలేజీకి వెళ్లాను. మధ్యాహ్నం 1.30 గంటలకు కాలేజీ నుంచి తిరిగొస్తుండగా అంబేద్కర్ చౌక్ వద్ద గతంలో నాపై అత్యాచారానికి పాల్పడిన అమిత్, జగ్ మోహన్ లిద్దరూ ఓ కారు దగ్గర నిలబడి ఉండడం చూశాను. వారిని పట్టించుకోకుండా వెళ్తున్న నన్ను అడ్డగించారు. వారిని చూసి భయానికి గురైన నేను మరింత భయపడిపోయాను. ఇంతలో వారిద్దరూ కారుదిగి బలవంతంగా కారులోకి నన్ను తోసేశారు. కారులో మౌసమ్, ఆకాశ్, సందీప్ కూర్చున్నారు. నేను అరవకుండా ఉండేందుకు వారు నన్ను కొట్టడం ప్రారంభించారు. నా సోదరుడి కోసం వెతికారని, అతడు వారికి దొరకలేదని చెప్పారు. తరువాత వారు నాతో బలవంతంగా మత్తు పదార్థం తినిపించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కారులో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో తెలియలేదు. నేను స్పృహలోకి వస్తుండగా, నన్ను చంపేయాలని ఒకడంటే, మరొకడు చిక్కుల్లో పడతామని వారించాడు. దీంతో నన్ను కారులోంచి రోడ్డు మీదకి గెంటేశారు. మెలకువ రావడంతో బలం తెచ్చుకుని చూసుకున్న నేను మరోసారి గ్యాంగ్ రేప్ కు గురయ్యానని గుర్తించాను. ఆ దారిలో వెళుతున్న కొంత మంది మహిళలు నన్ను ఆసుపత్రిలో చేర్చారు. కోలుకున్నాక ఆ ఐదుగురు రేపిస్టులపై కేసు పెట్టాను. గతంలో జైలుకు వెళ్లినా వారి బుద్ధి మారలేదు. కఠినశిక్ష పడకపోవడం వల్లే వారు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూనే ఉన్నారు. వారిని ఇలాగే వదిలేస్తే మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటారు. నాలాంటి వారు బాధితులుగా మారుతూనే వుంటారు" అని ఆమె తెలిపింది. కాగా, వీరంతా మూడేళ్ల క్రితం భివానీలో ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడగా, ఆ ఊరు వదిలేసి, రోహ్ టక్ వెళ్లి ఆ కుటుంబం బతుకుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి హాజరయ్యేందుకు పలు మార్లు వెళ్లడంతో బాధితురాలు ఎక్కడ ఉంటోందో నిందితులకు కనుక్కోవడం కష్టం కాలేదు. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.