: భూసేకరణలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది: ప్రొ.కోదండరాం ఆగ్రహం
మల్లన్న సాగర్ జలాశయం అవసరమా? అనే అంశంపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం, ప్రొ.హరగోపాల్‌తో పాటు పలువురు మేధావులు నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావుతో కలిసి హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్‌ను కట్టితీరుతామని ప్రభుత్వం పంతాలకు పోవడం సరికాదని, పంటకాలమంతా నీటి లభ్యత ఉన్నప్పుడు రిజర్వాయర్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. భూసేకరణలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముంపు బాధితుల హక్కులను పరిరక్షించాలని ఆయన అన్నారు. నీటి పారుదల నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని, పంతాలకు పోవడం సరికాదని అన్నారు.