: సినీ పరిశ్రమ అమరావతిలోనే ఉండాలి... మీ భూములున్న చోట కాదు: ఎలుగెత్తిన సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సినీ పరిశ్రమ ఉండాలని వ్యాఖ్యానించిన నటుడు శివాజీ, పరిశ్రమ ఎక్కడ పెట్టాలన్న విషయమై పాలక పక్ష నేతలు చర్చలు జరుపుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. "సినీ పరిశ్రమ ఎప్పుడూ రాజధానిలోనే ఉండాలి. క్యాపిటల్ సిటీకి గ్లామర్ కావాలి. అది సినీ నటులతోనే వస్తుంది. రాజధానిలో స్టూడియోలు, గార్డెన్స్ ఉండాలే తప్ప, మీకు భూములున్న చోట, మీ మంత్రులు, వారి అనుచరులు, బినామీలు ఉన్న చోట కాదు. రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకున్నారు. సినీ పరిశ్రమకు అందులో ఒక్క శాతం భూమినైనా ఇవ్వలేరా? బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలు చూడండి. ఆయా రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ ఎక్కడ ఉందో తెలియదా? కేవలం నాలుగు కుటుంబాల బాగు కోసమే చూసి ఎక్కడ బడితే అక్కడ చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తే, అభివృద్ధి కాదుకదా, అన్యాయం జరుగుతుంది" అని ఆయన అన్నారు. పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వారిని ముంచి ఆ డబ్బులు నొక్కేయాలని చూస్తున్నారని, చనిపోయిన తరువాత మన వెంట ఏమీ తీసుకువెళ్లలేమని గుర్తుంచుకోవాలని అన్నారు.