: నాజూగ్గా ఉన్నవారినీ వదలని మధుమేహం.. పరిశోధకుల హెచ్చరిక
సన్నగా ఉన్నాం కదా మన దగ్గరికి ఏ రోగాలూ రావు.. అని అనుకునే వారికి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ హెచ్చరిక చేశారు. అతి బరువు లేకున్నా.. నాజూగ్గా ఉన్నా.. టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. సన్నగా ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరికి టైప్-2 మధుమేహం వస్తుందని వారు చెబుతున్నారు. దినచర్యలో ఎక్కువ సేపు కూర్చోనే ఉండడం వల్ల ఈ ముప్పుని వారు కొనితెచ్చుకుంటున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రధానంగా 45 ఏళ్లు దాటిన వ్యక్తులు నాజూగ్గా ఉన్నప్పటికీ వారిలో మూడోవంతు వ్యక్తుల్లో మధుమేహ ముప్పు వచ్చిపడుతోందని వారు తేల్చి చెబుతున్నారు. రోజులో సరైన వ్యాయామం లేకపోవడం, పదే పదే కూర్చొనే ఉండడం వంటి అలవాటుతో వారిలో కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయని, దీంతో టైప్-2 మధుమేహం బారిన పడుతున్నారని చెప్పారు. ఈ అంశాన్ని గ్రహించి జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.