: చంద్రబాబూ... డైరెక్టుగా మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా: శివాజీ హెచ్చరిక
"ఇంకొకటి కూడా చెబుతున్నాను చంద్రబాబుకు... ప్రత్యేక హోదా విషయంలో... సార్ వినండి. ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీలతో సర్దుకుపోవాలని చూస్తే, డైరెక్టుగా మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాను. వింటున్నారా సార్! మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటాను. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాను. చరిత్ర హీనులవుతారా? చరిత్ర పురుషులవుతారా? మీరే డిసైడ్ చేసుకోండి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, "తమాషాలు చేస్తున్నారా మీరందరూ? ఆడుకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి? 33 వేల ఎకరాల భూమిని ఇస్తే, పంచుకుంటారా మీరందరూ కలసి? ఏమి రాజ్యం నడుస్తోందిక్కడ. మహానుభావుడు వెంకయ్యనాయుడికి ఇప్పుడు సమాచార శాఖ కూడా ఇచ్చారు. వారి విషపు పడగ ఏం చేస్తుందో భవిష్యత్తులో అంతా చూస్తారు. భావి తరాల ఉసురు తగులుతుంది మీకు. ఏమి నాటకాలు ఆడుతున్నారు? కేంద్రంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టయిల్ లో... ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనా? అంటున్నారు. సన్నాసుల్లారా... ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విడగొట్టిన సన్నాసులు మీరంతా? ఏ ఒక్కడికీ అర్హత లేదు. మనుషులు కాదు మీరు. ప్రత్యేక హోదా అంటే అంత చిన్న చూపా? ఆ రోజు గడ్డితిని హామీలు ఇచ్చారా?" అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నలు గుప్పించారు. అందరూ కలిసి ఏపీ హక్కులను కాపాడేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేసి, ప్రజల చీత్కారం చవిచూసి ప్రస్తుతం అనుభవిస్తోందని, తెలుగుదేశం పార్టీకి కూడా అదే గతి పట్టకుండా చూసుకోవాలని శివాజీ అన్నారు.