: ఏపీ ప్రజలపై ఇంత నిర్లక్ష్యమా?: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో హోదా సాధన సమాఖ్య


ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకోలేనంతటి పెద్ద తప్పులు చేస్తోందని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, హోదా కోసం రెండేళ్ల నుంచి దీక్షలు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రం మొత్తం ఏకమై, గత పాలకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే, ఉద్యమాలను అణచివేసేందుకే మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రజలపై నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. 14 లక్షల జనాభా ఉన్న గోవాకు ఇచ్చిన ఐఐటీ ఇనిస్టిట్యూట్ నే, ఐదున్నర కోట్ల మంది ఉన్న రాష్ట్రానికి ఇచ్చారని, దీంతో ఏం సంతోషపడాలని ప్రశ్నించారు. తమకు తృప్తి కలగడం లేదని, మూడు బడ్జెట్ లు వచ్చినా రాయలసీమ, ఉత్తరాంధ్ర దాహార్తి తీరలేదని, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉందని చలసాని తెలిపారు. తక్షణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News