: మైనర్ బాలికను పెళ్లాడిన వైజాగ్ యువతికి దేహశుద్ధి!


విశాఖలో జరిగిన విచిత్రమైన ఘటన ఇది. తనకు 15 రోజుల నాడు పరిచయమైన ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన తేజ అనే 25 సంవత్సరాల యువతి, ఆమెను తిరుపతి తీసుకువెళ్లి వివాహం చేసుకుని రాగా, విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తేజ, ఎయిర్ టెల్ డీలర్ దగ్గర ఉద్యోగం చేస్తోంది. ఆమెకు గాజువాకలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న సేల్స్ గర్ల్ తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి, ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇద్దరూ అమ్మాయిలే అయినప్పటికీ, జీవితాంతం కలిసుండాలన్న ఉద్దేశంతో తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుని వైజాగ్ తిరిగొచ్చారు. మైనర్ బాలిక మెడలో తాళిని గమనించిన తల్లిదండ్రులు నిలదీసే సరికి ఆ బాలిక విషయం చెప్పింది. దీంతో తేజను పట్టుకొచ్చి, పబ్లిక్ గా చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. తమ మనసులు కలిశాయని, జీవితాంతం కలిసుంటామని, తమను వదిలివేయాలని ఇద్దరూ చెబుతుండటం గమనార్హం. తాను చిన్నపిల్లను కాదని, మేజరేనని, తనతోనే ఉంటానని చెబుతూ వచ్చిందని తేజ పోలీసులకు వివరణ ఇచ్చింది. బాలిక తల్లిదండ్రులు మాత్రం, తేజ బలవంతంగా తమ బిడ్డను తీసుకుని వెళ్లిందని ఆరోపిస్తున్నారు. బాలిక మైనర్ అని తెలుసుకున్న పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. వీరికి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన విశాఖలో కలకలం సృష్టించింది.

  • Loading...

More Telugu News