: బయటి వ్యక్తులు చేసిన తప్పుకు టెండూల్కర్‌ని బాధ్యుడిని చేయలేం.. ఆయన ‘భారతరత్నమే’!: సుప్రీం
టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కి ఇచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలంటూ వీకే నస్వా అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. సచిన్ తనకు లభించిన దేశ అత్యున్నత అవార్డుని దుర్వినియోగం చేశారని వీకే నస్వా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘భారతరత్న సచిన్’ అని శీర్షికలు పెడుతూ చాలా మంది రచయితలు టెండూల్కర్ గురించి రచనలు చేశారని ఆయన కోర్టుకి తెలిపారు. సచిన్ కూడా ఈ అంశం పట్ల పలు కార్యక్రమాల్లో సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన అనంతరం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ టెండూల్కర్ ఈ అంశంలో నిబంధనలను అతిక్రమించలేదని ఈరోజు పేర్కొంది. రచయితలు భారతరత్న అనే పదాన్ని ఉపయోగించారని, దీనిలో సచిన్ తప్పేమీలేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. బయటి వ్యక్తులు చేసిన తప్పుకు టెండూల్కర్‌ని బాధ్యుడిని చేయడం భావ్యం కాదని పేర్కొంది.