: నేను బీజేపీలోనే ఉంటా... సిద్ధూ భార్య వెల్లడి
బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య మాత్రం సొంత పార్టీని వీడడం లేదట. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ, తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి రాజీనామా చేయలేదని ఆమె అన్నారు. తన భర్త మాత్రం బీజేపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారని తెలిపిన ఆమె, సిద్ధూ పంజాబ్ కు సేవ చేయాలని భావిస్తున్నారని, ప్రజాసేవలో ఆయనకు తనవంతు సహకారాన్ని అందిస్తానని వెల్లడించారు. ఎంపీగా తన భర్త రాజీనామాతో తనకు పదవిలో కొనసాగే హక్కు లేదని భావించే రిజైన్ చేశానని చెప్పిన ఆమె, బీజేపీని వీడబోనని అన్నారు. కాగా, సిద్ధూ ఆప్ లో చేరి, పంజాబ్ కు ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.