: ఎంసెట్ ర్యాంకులు, పేపర్ లీకేజీపై కమిటీ వేసి నిజం తేలుస్తాం... తప్పు జరిగితే కఠిన శిక్షే: మంత్రి లక్ష్మారెడ్డి

ఏపీ ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు తెచ్చుకుని, తెలంగాణ ఎంసెట్ లో 100లోపు టాప్ ర్యాంకులు తెచ్చుకున్న కొందరు విద్యార్థుల వైనంపై ఓ కమిటీని వేసి నిజాన్ని నిగ్గు తేలుస్తామని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన 8 మందికి 100 లోపు ర్యాంకులు రావడంపైనా ఆయన స్పందించారు. విద్యార్థులు గతంలో ఎలాంటి మార్కులు తెచ్చుకున్నారన్న అంశాన్ని ముందుగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఎంసెట్ కోసం 10 రకాల కోడ్ లతో ఉన్న ప్రశ్నాపత్రాలు సిద్ధం చేశామని, వీటి నుంచి ఒక కోడ్ ను పరీక్ష జరిగిన రోజున మాత్రమే నిర్ణయించామని ఆయన గుర్తు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వార్తలను ఖండించిన ఆయన, విచారణ మాత్రం జరిపిస్తామని, ఎక్కడైనా తప్పు జరిగిందని తేలితే మాత్రం చర్యలు తప్పవని, వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.